google.com, pub-9787416165664473, DIRECT, f08c47fec0942fa0
top of page

సమాజపు వైకల్యాన్ని సరిదిద్దాలి


ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటాం. ఈ రోజు వైకల్యాలున్న వ్యక్తుల విజయాలను తలచుకొని వారి కృషిని మెచ్చుకోవటమే కాక, వారిని కలుపుకొనిపోతూ సమాజంలో మనకు ఉన్న ప్రతి అవకాశాన్నీ వారికి కూడా అందుబాటులో ఉంచాలన్నదే ఈ నాటి ముఖోద్దేశ్యం. ఈ సందర్భంగా ప్రపంచంలో, భారతదేశంలోని దివ్యానుగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటికి పరిష్కారాలు అన్వేషించాలి, అన్ని అవకాశాలను వారికి అందుబాటులో ఉంచాలి.



ప్రపంచ వ్యాప్తంగా దివ్యంగులు చెందుతున్న అభివృద్ధి, పొందుతున్న సౌకర్యాల కన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువ . ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది లేదా ప్రపంచ జనాభాలో దాదాపు 15% మంది ప్రజలు నేడు ఏదో ఒక రకమైన వైకల్యంతో జీవిస్తున్నారు. వికలాంగుల హక్కులను గుర్తించడంలో కొంత మేర పురోగతి సాధించినప్పటికీ, వారు జీవితంలోని అన్ని పార్శ్వాలలో వృద్ధి చెందటానికి సమాజం, ప్రభుత్వాలు చాలా కృషి చేయాల్సి ఉంది.


ఈ మధ్య కాలంలో వైకల్యాలున్న వ్యక్తుల ప్రత్యేక అవసరాలను గుర్తించి పరిష్కరించడానికి అనేక దేశాలు తమ పాలనా విధానాలలో మార్పులు చేశాయి, చొరవ చూపించాయి, వీరి సమస్యల పట్ల ఎక్కువ దృష్టి సారించాయి. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు)లో సైతం ఏ ఒక్క వైకల్యం ఉన్న మానవుడిని విడిచిపెట్టకుండా ఉండాలన్న నిబద్ధతను చాటాయి. నెదర్లాండ్స్, జర్మనీ , కెనడా, జపాన్, అమెరికా వికలాంగుల సౌకర్యాల కల్పన, హక్కుల పరిరక్షణలో మొదటి 5 స్థానాలలో నిలుస్తూ మిగిలిన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.



దివ్యంగుల విషయంలో భారతదేశ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. ప్రపంచ జనాభాలో దివ్యంగుల సగటు 16 శాతం ఉండగా, 2011 జనాభా లెక్కలు మాత్రం మన జనాభాలో కేవలం 2.21% మంది మాత్రమే ఏదో ఒక రకమైన వైకల్యంతో జీవిస్తున్నారు అంటున్నాయి. వైకల్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం, బయట పడితే నలుగురిలో చులకన అవుతారన్న భయం, ఇప్పటికీ కొన్ని రకాల వైకల్యాలను గుర్తించడంలో ఉన్న ఇబ్బందులు వల్ల ఈ గణాంకాలు దేశంలో దివ్యంగుల సంఖ్యను చాలా తక్కువ చేసి చూపుతున్నాయన్న ఆరోపణ ఉంది. ముఖ్యంగా మానసిక వైకల్యం బారిన పడినవారు లెక్కల్లోకి రావడంలేదని నిపుణులు అంటున్నారు.


భారతదేశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న పెద్ద సవాలు విద్య, ఉపాధి అవకాశాలు సంపూర్ణంగా అందుబాటులో లేకపోవటం. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) నివేదిక ప్రకారం, భారతదేశంలో కేవలం 40% వికలాంగులు మాత్రమే అక్షరాస్యులు, ఇందులో పట్టభద్రులైన వారు పురుషుల్లో 6 శాతం, మహిళల్లో కేవలం 3 శాతం మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ఇక వికలాంగుల ఉపాధి రేటు జాతీయ సగటు కంటే గణనీయంగా తగ్గిపోయింది, కేవలం 36 శాతం వికలాంగులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ అధ్వాన్నంగా 25 శాతానికే పరిమితమయ్యింది. మహిళల్లో గ్రామీణ ప్రాంతంలో 25%, పట్టణ ప్రాంతాల్లో 16 % మాత్రమే ఉపాధికలిగి ఉండటం వీరికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుపుతోంది.


ఈ రోజున దేశంలో మొత్తం దివ్యంగుల్లో 20 శాతం మంది కదలిక సమస్యలతో, 19 % ద్రుష్టి లోపాలతో, 19 శాతం మంది వినికిడి లోపాలతో, 8 శాతం మంది బహుళ లోపాలతో బాధపడుతున్నారని భారత ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశంలో వికలాంగుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. వికలాంగుల హక్కుల చట్టం, 2016, వికలాంగుల హక్కులను కాపాడుతూ, వారి అవకాశాలను పెంచే ఒక మైలురాయి లాంటిది. ఈ చట్టం వికలాంగులలో మరిన్ని వర్గాలను, వారి అవసరాలను గుర్తించడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. వికలాంగ ఫించన్లు, ఉచితంగా పరికరాలు అమర్చటం, రీహాబిలేషన్ హోమ్ లు, మానసిక సమస్యల ఉచిత చికిత్స కోసం "సహయోగ్ " వంటి సౌకర్యాలు అందిస్తూ, విద్యా, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్ లు, స్కాలర్ షిప్ ల రూపంలో సహాయం చేస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో కనబడుతోంది. బలహీన వర్గాల అభివృద్ధికి రాజకీయ సాధికారిత మాత్రేమే అంతిమ పరిష్కారం అయినప్పుడు దివ్యంగుల విషయంలో కూడా రిజర్వేషన్ అవసరమని అఖిల భారత దివ్యంగుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.


ఇటీవలి సంవత్సరాలలో వివిధ రంగాలలో దివ్యంగుల చేరికపై ప్రాముఖ్యత, వారి హక్కులపై అవగాహన పెరుగుతోంది. విద్యా సంస్థలు, వికలాంగ విద్యార్థులకు వసతి కల్పించడానికి అనుకూల విధానాలను అవలంబిస్తున్నాయి. కొన్ని ప్రవేటు రంగంలోని కంపెనీలు వికలాంగుల ప్రతిభ మరియు సామర్థ్యాలను గుర్తించి మరింత సమగ్రమైన కార్యాలయాలను రూపొందించడానికి, అనుకూలమైన పని వాతారావణాన్ని కల్పించటానికి కృషి చేస్తున్నాయి. అసెంచుర్, కాండోర్ వర్క్ స్పేస్, మేక్ మై ట్రిప్ , కాప్ జెమిని , L ఓరియల్ ఇండియా వంటి కార్పొరేట్ కంపెనీలు దేశంలో దివ్యంగులకు ఉత్తమ పని ప్రదేశాలుగా నిలవగా, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 2. 02 శాతం మందితో, భారత్ పెట్రోలియం 2. 09 శాతం దివ్యంగ ఉద్యోగస్తులతో ఎక్కువ మందికి ఉద్యోగాలను కల్పించాయి. టాటా కన్స్యూమర్ 0. 40 %, రిలయన్స్ 0.42 % కంపెనీలు ఆశ్చ్యర్యకరంగా అతి తక్కువ దివ్యంగ ఉద్యోగులతో అట్టుడుగున ఉన్నాయి.


వైకల్యాలున్న వ్యక్తులకు సహాయపడటంలో నేడు మనుషులతో పోటీ పడుతోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. స్క్రీన్ రీడర్‌లు, వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ మరియు మొబిలిటీ ఎయిడ్స్ వంటి నూతన ఆవిష్కరణలు దివ్యంగుల అవసరాలను తీర్చటంలో , వారి సామర్ధ్యాలను ప్రపంచానికి పరిచయం చేయటంలో , స్వయం ఉపాధి కల్పనలో అద్భుతంగా సహాయపడుతున్నాయి. బ్రెయిలీ స్మార్ట్ ఫోన్, మెట్లను ఎక్కే కుర్చీలు, అత్యాధునిక వినికిడి యంత్రాలు, మొబైల్ ఆప్ లు, బ్రెయిలీ కన్వెర్టర్లు, అడాప్టివ్ కీ బోర్డులు, స్మార్ట్ కళ్లద్దాలు, వ్యక్తిగత అవసరాలకు స్పందించే పరికరాలతో ఈ నాడు సాంకేతిక ప్రపంచం దివ్యంగులకు సమాజాన్ని చేరువ చేస్తోంది.



భారతదేశంలో సైతం దివ్యంగుల అవసరాలపై దృష్టి సారించే టెక్ స్టార్టప్‌ల ట్రెండ్ పెరుగుతోంది. దృష్టి లోపం ఉన్నవారికి నావిగేషన్‌లో సహాయపడే యాప్‌ల మొదలు కంటి చూపు లేనివారి, వినికిడి సమస్య ఉన్నవారి విద్యావసరాలను తీర్చే ప్లాట్‌ఫారమ్‌ల వరకు ఎన్నో నూతన సాంకేతికతలు రూపు దిద్దుకుంటున్నాయి. వీరికి సహాయ పడటం కోసం ట్రెస్ట్లీ లాబ్స్, సైన్ లాబ్స్ ( బెంగళూర్ ) , లైఫ్ స్పార్క్ ( ముంబై) వారు అభివృద్ధి చేస్తున్న అస్సిస్టివ్ సాంకేతికత దివ్యంగులకు విద్యా, ఉపాధి కార్యక్రమాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పరిశోధనా కార్యక్రమాలు దివ్యంగుల అవసరాలను తీర్చటడంలో ఎంతో దోహదపడతాయి.



దివ్యంగుల అభివృద్ధి, సహకారం అందించే విషయంలో అనేక సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, ఇంకా సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. వైకల్యాలున్న వ్యక్తుల జీవితాన్ని అన్ని కోణాల్లో అర్ధం చేసుకుని, పూర్తి స్థాయిలో వారిపట్ల సహానుభూతి చూపడంలో, తగిన సహకారాన్ని అందించటంలో మిగిలిన సమాజం వైకల్యపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది అని చెప్పాలి. దివ్యంగులకు మౌలిక సదుపాయాల కొరత, సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దివ్యంగులతో కూడిన చక్కటి సమ్మిళిత సమాజాన్ని కలిగిఉండాలంటే అనుకూల ప్రభుత్వ విధానాల రూపకల్పన చేస్తూ, విద్య, ఉపాధి కల్పనలో ద్రుష్టి సారిస్తూ, వీరి పట్ల సామాజిక వైఖరులలో మార్పు తెచ్చే దిశగా నిరంతర ప్రయత్నాలు అవసరం.


ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవడం ద్వారా, వీరు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను గుర్తించడం ద్వారా వారికి అవసరమైన సామాజిక, మానసిక , సాంకేతిక సహాయాన్ని అందిస్తూ సామర్థ్యంతో సంబంధం లేకుండా దివ్యంగులు సైతం జీవితంలోని అన్ని అంశాలలో సంపూర్ణ స్వేచ్ఛను పొందగలిగే వాతావరణాన్ని సృష్టించవచ్చు. తమ వైకల్యాన్ని జయించి సర్వమానవాళి శ్రేయస్సుకోరి అద్భుత పరిశోధనా ఫలాలతో ప్రపంచ మానవాళికి నేటికీ దారి చూపిస్తున్న, ప్రపంచ గతిని మార్చిన థామస్ అల్వా ఎడిసన్, నికోలే టెస్లా , రాల్ఫ్ బ్రాన్ , స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావులు నేటి తరానికి స్ఫూర్తి కావాలి. దివ్యంగుల శక్తి సామర్ధ్యాలను చిరునామాగా మారిని భారత పారా ఒలింపియన్లు మరియప్పన్, తంగవేలు, మురళికాంత్ పెత్కర్, దీపా మాలిక్, జోగిందర్ సింగ్ బేడీ , అమిత్ కాంత్ సరోహ, భావినా పటేల్ వంటి వారు తమ ప్రతిభకు ఆకాశమే హద్దని చాటుతున్నారు. వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల కోసం ప్రభుత్వం, పౌర సమాజం కృషి చేయటం, మరింత సమగ్రమైన విధానాలను తీసుకురావడం ఇప్పుడు చాలా కీలకం. ఇందులో చట్టపరమైన అంశాలే కాకుండా, వివిధ రకాల వైకల్యాలున్న వ్యక్తుల యొక్క విభిన్న అవసరాలను పరిష్కరించే ఆచరణాత్మక ప్రణాళిక రూపకల్పన కూడా జరగాలి.






33 views0 comments

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page